
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రావెల్లి శివారులో శిక్షణ విమానం కుప్పకూలింది. కూలిన వెంటనే మంటలు అంటుకుని పూర్తిగా తగలబడిపోయింది. శిక్షణ పైలట్ తోపాటు మరొకరు కూడా అక్కడికక్కడే మరణించారని అంటున్నారు. ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు ప్రారంభించారు.
తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని టాటా కాఫీ కంపెనీ సమీపంలో ఉన్న గుట్టల మధ్య శిక్షణ విమానం కూలిపోయింది. ఈ విమానం దుండిగల్ ఎయిర్ పోర్టుకు సంబంధించిన శిక్షణ విమానంగా గుర్తించారు. విమానం కూలిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో స్థానికులు శబ్దం వచ్చినవైపు రాగా విమానం మంటల్లో కాలిపోతూ కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లినా పైలట్ ని రక్షించేందుకు అవకాశం లేదు.
గతంలో కూడా హైదరాబాద్ పరిధిలో శిక్షణ విమానాలు కూలిపోయిన ఘటనలు జరిగాయి. కొన్నిసార్లు శిక్షణ పైలట్లు ప్రాణాలతో బయటపడేవారు. అయితే ఈ ఘటనలో వెంటనే మంటలు అంటుకోవడం, పైలట్ కు తప్పించుకునే అవకాశం కూడా లేకపోవడంతో సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. పైలట్ తో పాటు కోపైలట్ కూడా మంటలకు ఆహుతైనట్టు సమాచారం.
♦